Yandamoori Veerendranath getting doctorate for his literary and social service.   Donation of 3 lakhs to PR college , Kakinada for renovation of meeting hall. the college where Yandamoori Veerendranath studied.
 
యండమూరి వీరేంద్రనాథ్ గురించి..

 

"రదాగా కథలు రాశారు. నాటకాలు రాశారు. పేరు కోసం నవలలు రాశారు. డబ్బుకోసం సినిమాలకు రాశారు. నవలా రంగానికి డిమాండ్ తగ్గిన తర్వాత వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు రాశారు. ఇదంతా ఊరికే సాధ్యం కాలేదు. ఎన్నో పుస్తకాలు చదివారు. ఇంగ్లీషుతో పాటు ఇతర భాషల సాహిత్యాన్నీ విస్తృతంగా అధ్యయనం చేశారు. తనకంటూ ఒక శైలిని స్పష్టించుకున్నారు. పాఠకులతో ఆత్మీయ సంబంధాలను పెంచుకున్నారు. ఏది చేసిన ఇష్టంగానే చేశారు. ఎంతో మంది అభిమానులను సంపాందించుకున్నారు. ఇప్పుడిక ఆయనకు సంతృప్తినిచ్చే కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారు.
-ఈనాడు ఆదివారం 6 మార్చి, 2005


యండమూరి జీవిత సంగ్రహం:-


బాల్యం:

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా రాజోలులో శ్రీ యండమురి చక్రపాణి, శ్రీమతి నరసమాంబ దంపతులకు 14-11-1948 లో జన్మించారు యండమూరి వీరేంద్రనాథ్. తండ్రి ఇన్ కంటాక్స్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తుండడం వల్ల ఉద్యోగ రీత్యా వివిధ ప్రదేశాలు తిరిగినందు వలన యండమూరి బాల్యం వివిధ ప్రాంతాల్లో గడిచింది.

విద్యాభ్యాసం:

ప్రాథమిక విద్య కాకినాడలోనూ, రాజమండ్రిలోనూ, ఆరవ తరగతి కడప జిల్లా జమ్మల మడుగులోనూ, ఏడవ తరగతి అనంతపూరంలోనూ, ఎనిమిది, తొమ్మిది తరగతులు ఖమ్మంలోనూ,పదవ తరగతి, ఇంటర్మీడియట్ లు హైదరాబాద్ లోనూ, బి.కాం. డిగ్రీ కాకినాడలోనూ చదివారు. 1972లో సి.ఎ.(ఛార్టెర్డ్ ఎకౌంటెన్సీ) పట్టా పుచ్చుకున్నారు.

చిన్నతనంలో తాతగారి వద్ద కొంతకాలం చదివిన యండమూరి ఆరో క్లాసు తప్పారు. తర్వాత తండ్రిగారి వద్దకు చేరుకున్నారు.వారి నాన్నగారు ప్రతీ రోజూ ఒక గంట సేపు వీరేంద్రనాథ్ తో పాటు ఆ సందులోని పిల్లలందరికీ కూడా ఉచితంగా పాఠాలు చెప్పేవారు. ప్రతిభ కనబర్చిన వారికి పెన్సిళ్ళు, రబ్బర్లు బహుమతులుగా ఇచ్చేవారు. తండ్రి శిక్షణ ఫలితంగా ఆ సంవత్సరం లెక్కలపరీక్షలో నూటికి నూరు శాతం మార్కులు తెచ్చుక్కున్నారు. ఏడవ తరగతి ఫస్ట్ క్లాసు వచ్చింది. ఇక చదువు విషయంలో వెనక్కి తిరగలేదు. వందేళ్ళ చరిత్ర ఉన్న హైదరాబాద్ స్కూలు చరిత్రలో అత్యధిక మార్కులతో రికార్టు సృష్టించారు. సి.ఎ. పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఒక సంవత్సరం శిక్షణపీరియడ్ తగ్గింది.

అప్పుడర్థమయింది ఆయనకు సామాన్య విద్యార్థి కూడా మంచి శిక్షణనిచ్చి అత్మ విశ్వాసం కలిగిస్తే అసాధారణ విజయాలు సాధించగలడని. ఆ తరువాత రచనా జీవితంలో స్టడీ టెక్నిక్స్ పై పుస్తకాలు, రచించడానికి శిక్షణా తరగతులు నిర్వహించడానికి ఈ స్వానుభవం ప్రేరణ ఇచ్చింది.

యండమూరి జీవితం పై తండ్రి ప్రభావితం ఉంది. తండ్రి నుండి చేర్చుకున్న విషయాలని ఆచరించారు. ఆయన నుండి స్ఫూర్తి పొందారు. తిరిగి తన కుమారుడి కది అందించగలిగారు.

తొలిసంపాదన:

ఖమ్మం జిల్లాలో ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడే ఓ లాయరుగారి పిలల్లకు ట్యూషన్ చెప్పేవారు. రోజుకు రూపాయి ఇచ్చేట్లు ఒప్పందం.

బి.కాం., చదువేటప్పుడు ప్రైవేట్ కంపేనీల క్యాష్ ప్లో స్టేట్ మెంట్స్ రాయడం ద్వారా నెలకు వంద నూటయాభై వరకు సంపాందించేవారు. తన ఖర్చులకు తానే సంపాందించుకునేవారు.

వృత్తి:

ఛార్టెర్డ్ అకౌంటెంట్ అయిన యండమూరి 5 సంవత్సరాలు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లోనూ, 10సంవత్సరాలు ఆంధ్రబ్యాంక్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ విభాగానికి చీఫ్ ఆఫీసర్ గానూ పనిచేశారు. తరువాత రచన రంగంలో స్థిరపడాలని నిర్ణయం తీసుకుని ఉద్యోగానికి రాజీనామా చేశారు.

వైవాహిక జీవితం:

యండమూరి వివాహం 10-03-1974లో జరిగింది. వారి భార్యపేరు ’అనుగీత’. రచనా జీవితం సాఫీగా సాగడంలో ఆయనకు శ్రీమతి నుండి చక్కటి సహకారం లభించింది. ఆయన రచనలకు సాహిత్యపరంగా సహకరించారామె. వారి కుమారుడి పేరు ప్రణీత్.

తండ్రి మార్గదర్శకత్వంలో చదువుని, వృత్తిని చక్కగా ప్లాన్ చేసుకొని అమలు పరిచాడు ప్రణీత్. ఇంటర్మీడియట్ పరీక్షల్లో స్టేట్ ర్యాంక్ సంపాందిచుకున్నాడు. తన 16వ ఏటునుంచే ఒక వైపు ఉద్యోగం చేస్తూ,మరో వైపు బి.కాం., సి.ఎ.చదివి 23 సంవత్సరాల వయసులోనే ప్రపంచ బ్యాంక్ లో ఉద్యోగం సంపాందించుకున్నాడు. అక్కడ పనిచేసేవారందరిలోనూ చిన్న వయసు ప్రణీత్ ది. రెండేళ్ళ తరువాత అక్కడ రాజీనామా చేసి ఫ్రాన్స్ లోని INSEAD యునివర్సిటీలో ఎమ్.బి.ఎ చదివాడు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక టైర్ కంపెనీలో 'Business planning and Control Executive'గా పనిచేసాడు. ప్రస్తుతం Bain and complany లో సంవత్సరానికి రూ.2.75 కోట్ల జీతంపై పని చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రణీత్ వయసు 38 సంవత్సరాలు.

రచనా జీవితం :

తెలుగు సాహిత్యంలో నాటకం, నవల విభాగాలలో ఒక నూతన ఒరవడి సృష్టించిన ఘనత యండమూరిది. కథ, కథానిక, నాటిక, నాటకం, వ్యాసం, సినిమాలకు స్క్రిన్ ప్లే, దర్శకత్వం ఇలా తను చేపట్టిన ప్రతి అంశంలో తనదైన ముద్ర వేశారు. కోట్లాది మంది అభిమానుల్ని సంపాందించుకున్నారు. ఆయన రాసిన నవలలు కొన్ని సినిమాలుగా రూపుదిద్దుకొని ఆఖండ విజయాలు సాధించాయి.

దర్శకుడిగా వెనక్కి తగ్గినప్పటికీ పట్టుదల, ఏకాగ్రత, ప్రావీణ్యలతో తిరిగి అచిరకాలంలోనే మునపటి కన్నా మంచి స్థాయిలకి చేరుకున్నారు. కష్టాలను ఓర్పు, పరిణితిలతో ఎదుర్కొన్నారు. విజయాలు కైవసం చేసుకున్నారు. అనితర సాధ్యుడిగా నిలచారు.

నేటి మనిషి మరింత బాగా బతకాలన్నది ఆయన తపన. తాను నిర్మించుకున్న అజ్ఞానపు కోటని ఛేందించుకుని నిరాశ, నిర్లిప్తతల నుండి కీర్తి, సంపద, మనశ్శాంతి వైపు దూసుకేళ్ళేందుకు కావలసిన ఉపకరణాలు తెలియజెప్పి మరడానికి ఉత్తేజం, ప్రేరణ కల్పిస్తాయి యండమూరి వ్యక్తిత్వ వికాస రచనలు. అవి ఎంతో మందికి నైతిక స్థైర్యాన్నిచ్చాయి. జీవితానికి కొత్త అర్థం చెప్పాయి. తమ రంగాల్లో విజయం సాధించడానికి తోడ్పడ్డాయి. ఎంతో మందిని ప్రభావితం చేసాయి. అలాగే రికార్డు స్థాయిలో ప్రజాదరణ కూడా పొందాయి.

శిక్షణా తరగతులు:

యండమూరి వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతులు నిర్వహిస్తునారు.
’పెద్దవారికి నెం.1 ఎలా అవ్వాలి’
’పిల్లలకు ఎలా చదవాలి’
’యువకులకు జీవితం ఎలా ప్రారంభించాలి’
’దంపతులకు సుఖంగా, అన్యోన్యంగా ఎలా జీవించాలి’ అన్న అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ఎన్నో కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులకి యండమూరిచే శిక్షణ ఇప్పిస్తున్నాయి.

అభిరుచులు:

  • చదవడం
  • వ్రాయడం
  • మంచి కలాలను సేకరించి వ్రాయటం
  • తోట పని
  • ప్రకృతిలో ఆహ్లాదంగా గడపడం
  • వంట చేయడం

తాను చేసే ప్రతీ రచనకూ ఒక కొత్త పెన్నుని వాడటం ఆయనకలవాటు.