సరస్వతీ విద్యాపీఠం..

 

ఆడుతూపాడుతూ...చదువు


కాకినాడసరస్వతీ విద్యాపీఠంలో


పిల్లలకు ఉచిత వ్యక్తిత్వ శిక్షణ


యండమూరి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సరస్వతీ విద్యాపీఠాన్ని 2006 నవంబర్ 14న ప్రారంభించారు. బీదా బీక్కి పిల్లల భవిష్యత్తును తీర్చి దిద్దే లక్ష్యంతో ఈ పీఠం ఏర్పాటైంది. సరస్వతీ విద్యా పీఠానికి వచ్చిన పిల్లలు చదువు ఇంత బాగుంటుందా...? అనే ఫీలింగ్ తో ఇంటికి వెళ్ళాలనేది యండమూరి ఈ పీఠం ద్వారా సాధించదలచుకున్నారు.ప్రేరణ:

యండమూరు మంగళూరు వద్ద పద్మ విభూషణ్ వీరేంద్ర హెగ్దే అనాధ ఆశ్రమానికి ఒకసారి వెళ్ళారు. అక్కడ ఒక్కొక్క కుర్రవాడికీ దున్నడానికి కాస్తనేల, నాగలి, ఒక గేదె ఇస్తారు. కూరగాయలు పండించి, పాలుపితికి తీసుకెళ్ళి అమ్ముతూ ఆ డబ్బుతోనే చదువుకోవాలి. చదువు పూర్తయ్యాక వాటిని మరొక అనాధ కుర్రవాడికి అప్పగించి వెళ్ళిపోవాలి. చిన్నప్పట్నుంచే శ్రమ పడడం, శ్రమని మార్కెట్టులో కరెక్టుగా అమ్ముకోవడం తెలిసిన ఆ పిల్లల్లో కొందరికి మారుతి కార్లు కూడా ఉన్నాయి. ఇది యండమూరి జీవిత దృక్పథాన్ని మార్చివేసింది. సరస్వతీ విద్యా పీఠ స్థాపనకి ప్రేరణగా నిలిచింది.

సరస్వతీ విద్యాపీఠంలో...

సరస్వతీ పీఠం ప్రాంగణంలోనే ఒక ఆడిటోరియాన్ని ఏర్పాటు చేశారు. యండమూరి నెలలో పదిహేను రోజుల పాటు అక్కడ ఉండి పిల్లలకు స్వయంగా వివిధ అంశాల్లో శిక్షణనిస్తారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లోని పాఠశాలల నుంచి రోజుకి దాదాపు 35 మంది పేద విద్యార్థుల ఎంపికలో ప్రాధాన్యం ఇస్తారు.

శిక్షణ అంతా సరదగా, ఆడుతూ, పాడుతూ సాగిపోతుంది. తరగతి గదులు...టీచర్లు...బెత్తం దెబ్బలు....నల్ల బోర్డు బట్టీ వేయించడం చదవక...పోతే డొక్క చించుతానంటు టీచర్ల తల్లిదండ్రుల బెదిరింపులు...నలుమూలలా నలుగు గోడలు...ఇలాంటివేం ఇక్కడ ఉండవు. ప్రకృతి ఒడిలో చదువుల తల్లి సరస్వతీ దేవీపాదాల చెంత పిల్లలకు విద్యాబుద్దులు చెబుతారు...విద్యాబుద్ధులు అంటే పాఠాలు కాదు సుమా!..

నిజానికి ఇక్కడ నేర్పే పాఠాలు తరగతి గదుల్లో ఉపాధ్యాయులు చెప్పనివి. ఇంట్లో తల్లిదండ్రులకు తెలియనివి. బయట బతకడానికి పనికోచ్చే నైపుణ్యాలకు ఇక్కడ పదును పెడతారు. పరిస్థితుల ప్రభావమో, ఆర్థిక కారణలో, మరోకటో....పిల్లల్లో సహజంగానే ఉండే సృజనాత్మకశక్తి నిద్రాణంగా ఉండిపోకుండా ఇక్కడ తట్టిలేపుతారు. రేపటి పౌరుల బంగారు భవిష్యత్తు సరస్వతీ విద్యా పీఠంలో రూపుదిద్దుకోబోతోంది.ఒకరోజు వర్క్ షాప్ లో...

రోజూ ఉదయం పది గంటల నుంచి సాయంత్రరం నాలుగున్నర వరకు వివిధ అంశాల్లో తర్ఫీదునిస్తారు. యండమూరి ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు దృక్పథాలను ఏర్పరచుకోవడం ఎలా? మంచి మార్కులు, ర్యాంకులు సాధించడం ఎలా?, బాగా చదవడం ఎలా?, జ్ఞాపక శక్తి ఎలా పెంపొందించుకోవాలి? ఇత్యాది అంశాలపై ఆయన స్వయంగా పాఠాలు చెబుతారు.

మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ బోధనా కార్యక్రమం ఉంటుంది. ఆ తరువాత అంతా ఆడూతూ పాడూతూ ఉల్లాసంగా సాగిపోయేలా కార్యక్రమాలను రూపొందించారు. సరస్వతీ విద్యాపీఠానికి సమీపంలోనే కాలువ ఉంది. రైలు పట్టాలు కనబడుతుంటాయి. మధ్యాహ్నం ఒంటి గంట తరువాత పిల్లలు ఈ కాలువ ఒడ్డున ఆడుకోవచ్చు. పిల్లలు బోటింగ్ చేసేందుకు రెండు బోట్లను ఏర్పాటు చేశారు. పిల్లలు ఈ బోట్లపై కాలువలో షీకారు చేయవచ్చు. ఇంకా ఇక్కడే పూరిల్లు, ఇతరత్రా సౌకర్యాలు ఉంటాయి. అనంతరం పిల్లలచేత చేపలు పట్టించడాన్ని సాధన చేయిస్తారు.
పిల్లలకు చేపలు కొనివ్వడం కాదు... వారికి గాలం వేయడం నేర్పించాలి ’

అనేది ఆంగ్లసామేత. చేపలు కొని వండిస్తే పిల్లలు తినడానికే అలవాటు పడతారు. అదే వారికి గాలం ఎలా వేయాలో నేర్పితే వారే ప్రయత్నంతో చేపల్ని సంపాదించగలరనేది ఈ సామెతలో ఇమిడి ఉన్న వ్యక్తిత్వ వికాస సూత్రం. యండమూరి కూడా పిల్లలకు ఆ దిశలోనే శిక్షణ ఇవ్వనున్నారు.

అయితే ఇక్కడ పిల్లల చేత చేపలు పట్టించడంలోని పరమార్థం ఏమిటంటే...సాధారణంగా 13-16 సంవత్సరాల మధ్య వయసు పిల్లలు హైవర్ యాక్టివ్ గా ఉంటారు. ఈ వయసుపిల్లలు పట్టుమని పది నిముషాలు కూడా ఒకచోట కుదురుగా కూర్చోలేరు. చేపలు పట్టాలంటే కుదురుగా ఒకచోట కూర్చోవాలి. దీనికి ఏకాగ్రత కావాలి. పిల్లల్లో ఈ ఏకాగ్రతను పెంచేందుకే చేపలు పట్టడాన్ని పిల్లలకు అలవాటు చేయలని తలపోస్తున్నట్టు యండమూరి చెబుతున్నారు. ఇలా అరగంటపాటు కూర్చోగలిగితే వారికి చేస్తున్న పనిపై పట్టు పెరుగుతుందని, ఇతర పనులను కూడా ఏకాగ్రంగా చేయగలుగుతారని ఆయన విశ్లేషిస్తున్నారు.

ఇక, ఇలాంటిదే మరొకటి...సూదిలో దారం ఎక్కించటం. విద్యార్థుల మధ్య ఈ అంశంలో పోటీ పెడతారు. ఏకగ్రత ఉంటే ఏమేం సాధించవచ్చో పిల్లలకు నేర్పేందుకే ఇలాంటి చర్యలను అలవరుస్తున్నట్టు ఆయన చెప్పారు. ఏకాగ్రతతో పని చేసేటప్పుడు చేతులు వణుకుతున్నాయా?, లేదా? అని పరిశీలించడం, తమను తాము అంచనా వేసుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయంటరాయన.

ఏకాగ్రత కార్యక్రమాలు ముగిశాక సమీపంలోని గుడిలో పిల్లలందరిచే అరగంట పాటు యోగా వంటిది చేయిస్తారు.మౌనంగా ఉండడం, ప్రార్థన ఎలా చేయాలో , అదెలా ఉండాలో , మౌనంగా ఉండడం ఎలాగో , మౌనంగా ఉండడం వల్ల కలిగే లాభాలేమిటో తెలియజేస్తారు. ఇలా నెలలో పది రోజుల పాటు పది బ్యాచ్ లకు రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు శిక్షణ ఇస్తారు.

ఈ వర్క్ షాప్ లో పాల్లొనాలంటే...?

ఏ స్కూల్ వారైనా ముందుగా యండమూరిని సంప్రదించి వారి పిల్లలను సరస్వతీ విద్యా పీఠానికి పంపించవచ్చు. ఈ శిక్షణ పూర్తిగా ఉచితం.

వివరాలకు:

సరస్వతీ విద్యాపీఠం,
కాకినాడ - సామర్లకోట రోడ్
మాధవపట్నం, తూర్పుగోదావరి జిల్లా,
ఆంధ్రప్రదేశ్.
ఫోన్: 92465 02662
ఈమెయిల్: yandamoori@hotmail.com