పబ్లికేషన్స్ / నాన్ - ఫిక్షన్. / విజయం వైపు పయనం

 

ఒక శుక్రవారం సాయంత్రం..

లైబ్రరీలో కూర్చుని చదువుకుంటున్నాను. దూరంగా మైకులోంచి ద్వారం వెంకటస్వామి నాయుడు గారి వాయులీనం లీలగా వినిపించసాగింది.

స్పష్టంగా వినడం కోసం, చదువుతున్న పుస్తకం మూసివేసి బయటకొచ్చాను. లైబ్రరీ బయట నాలాంటి వాళ్లే కొందుతాదాత్మ్యంతో వింటున్నారు. నేను కూడా కూర్చున్నాను. అందరం నిశ్శబ్దంగా ఆ ఫిడేలు మీద గమకాల్ని అస్వాదిస్తున్నాం.

ఆ సమయంలో ఒక ముప్ఫై ఏళ్ల వ్యక్తి ఇద్దరు పిల్లలతో వచ్చి కూర్చున్నాడు. అక్కడి వాతావరణం మారిపోయింది. ఆ పిల్లలిద్దరూ ఒకర్నొకరు, కొట్టుకుంటూ, అల్లరి చేస్తూ మా మధ్య తిరుగుతూ గోల చెయ్యాసాగారు. అయిదు నిముషాలు గడిచాయి. అందరికీ చాలా ఇబ్బందిగా ఉన్న మొహమాటం కొద్దీ సహిస్తున్నారు. ఫిడేలు రాగం ఇంకా వినిపిస్తూనే ఉంది. నేను ఇక ఆగలేక - ’ఇది లైబ్రరీ , మీ పిల్లల్ని గొడవ చెయ్యవద్దనండి’ అన్నాను కరుగ్గా. అతడు నిస్తేజమైన కళ్లతో నా వైపు చూశాడు. ’గోల చేస్తున్నారు కదూ, అవును. పిల్లలు.....వాళ్ల అమ్మ ఇప్పుడే చనిపోయింది. అరగంట తరువాత శవాన్ని ఇస్తామన్నారు. ఆసుపత్రిలో గొడవ చేస్తున్నారని ఇలా తీసుకువచ్చాను’ అన్నాడు. అతడి మీద అప్పటి వరకూ ఉన్న కోపం - జాలిగా మారింది. కోపం...జాలిగా, అసూయ - ప్రేమగా, ద్వేషం - స్నేహంగా, పగ - ప్రేమగా, అసమర్థత - సమర్థతగా, ఆవేశం - ఆలోచనగా మారవచ్చు. ఇవన్నీ మన బలహీనత స్థాయిభావాలు. కావాల్సిందల్లా పరిస్థితిని పై స్థాయిలోంచి పరిశీలించగల్గడమే. మన సమస్యని అవతలి కోణంలోంచి చూడగల్గడమే. అప్పుడు మనకెవరూ శత్రువులుండరు. మనకి సమస్యలుండవు. ఉన్నా, వాటిని నవ్వుతూనే పరిష్కరించుకోగల స్థిరత్వం మనకి అలవడుతుంది. అదే విజయం వైపు పయనం.

 
to purchase book