ఔత్సాహిక రచయితలకు సూచనలు..

ఒక వార పత్రిక ఎడిటర్ కి రోజుకి కనీసం ఇరవై కథలు, వంద దాకా ఇతర ఆర్టికల్స్ వస్తాయి. సబ్ ఎడిటర్లు వడపోత కార్యక్రమం నిర్దాక్షిణ్యంగా ఉంటుంది. కథలో థీమ్ బావుండి ఉండొచ్చు. దానికి చదివించే గుణం లేకపోయి ఉండొచ్చు. భాషాదోషాలు ఎక్కువగా ఉండొచ్చు. వీటిలో ఒక్క కారణం చాలు ’ఆర్’ అనే అక్షరం వ్రాసి వెనక్కి తోసేయడానికి, రచనల్లో స్వతహాగా కాస్త అభిరుచి, ప్రవేశం ఉన్న వారికి కథలు, నవలలు వ్రాయడానికి యండమూరి వీరేంధ్రనాథ్ అందుస్తున్న సూచనలు...

టైటిల్ ప్రారంభం..

 • తీసుకున్న థీమ్ ఏదైన ప్రారంభం మాత్రం పాఠకుణ్ణి ఆకట్టుకునేలా ఉండాలి. అది శృంగారం కానీ, హాస్యం కానీ, భయానకం కానీ...నవలలో ఏదైతే ఎక్కువ చెప్పబోతామో ఆ రసమే మొదట చాప్టర్ లో ప్రతిబింబిచడం జరిగింది.
 • వీలైనంత వరకు రచనని సమయంతో కానీ, వర్ణనలతో కానీ ఒక ఉత్తరంతో కానీ, ప్రారంభించడం మంచిది కాదు. సంఘటనతో ప్రారంభిస్తే మంచిది.
 • కథకి సంబంధించిన టైటిల్ ఉండాలి తప్ప కథకి వ్యతిరేకంగా ఉండే టైటిల్ ఉండకూడదు.
 • పుస్తకాల షాపుకి వెళ్ళి పాఠకుడు అడిగే విధంగా టైటిల్ ఉండాలే తప్ప ఇబ్బంది పెట్టే పేర్లు కానీ, పొడువైన పేర్లు కానీ ఉండటం అంత మంచిది కాదు.
 • నవల ప్రారంభంలోనే వీలైనన్ని పాత్రల్ని ప్రవేశపెట్టి పాఠకుడిని కన్ ప్యూజ్ చెయ్యకూడదు. ఒక పాత్రలో ప్రారంభించి క్రమంగా మిగతా పాత్రల్ని ఒకదాని తర్వాత ఒకటి ప్రవేశపెట్టాలి. అలా చేసేటప్పుడు పాత్రల మధ్య సంబంధం ఏమిటో స్పష్టంగా చెప్పాలి. వీలైనంత వరకూ రెండో పాత్ర ప్రవేశించగానే, అప్పటికి పాఠకులకి పరిచయం ఉన్న మొదటి పాత్రకీ, ఈ రెండో పాత్రకీ సంబంధం ఏమిటో మొదటి వాక్యంలోనే చెప్పటం మంచిది.
 • పది వాక్యాలు వ్రాయగానే, ’నా ఆలోచనలు గతంలోకి జారుకున్నాయి’. అని ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళడం చాలామంది చేసే పని. దీన్ని సాధ్యమైనంత వరకూ మానుకోవాలి. ముఖ్యంగా కథల్లో.

కథాంశం:

 • సస్పెన్స్ థ్రిల్లర్ వ్రాసేటప్పుడు ’కథ’ కన్నా ట్విస్ట్ లు ఎక్కువ ఉండాలి. పాఠకుడు ఊహించలేని మలుపులు తిప్పుతూ ఉండాలి.
 • రొమాన్స్ వ్రాసేటప్పుడు చిలిపిదనం, భావుకత, ఆహ్లాదం ఉండాలి.
 • హాస్యం వ్రాసేటప్పుడు సంభాషణల పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి.
 • ఇకపోతే అర్ట్రత ప్రధానంగా వ్రాసేటప్పుడు ప్రాతల పోషణ పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. సంఘటనని ఎక్కువ విడదీసి దాంట్లో ఆర్ట్రతని చొప్పించాలి.
 • కుటుంబ కథాంశాలు వ్రాసేటప్పుడు నాటకీయం బాగా ఉండాలి. పాత్రలు పటిష్ఠంగా ఉండాలి.

కథా విస్తరణ:

 • ఏయే సంఘటన ఎంత వ్రాయాలి అనే దాని మీదే నవల యొక్క విజయం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి, నవలలో ఒక పాత్రని తీసుకొని దాని స్వభావాన్ని వర్ణిస్తూ పేజీలకు పేజీలు వ్రాస్తే పాఠకుడికి బోర్ కొడుతుంది. అలాగే అనవసరమైన చోట వర్ణనలు కూడా పాఠకుల్నివిసిగెత్తిస్తాయి.
 • కొంతమంది రచయితలు ఒక చిన్న విషయం చెప్పటం కోసం పది సంఘటనలు వ్రాస్తారు. మరికొందరు ఒక పేజీలో చెప్పల్సిన సంఘటన పదిపేజీలు వ్రాస్తారు. రెండూ తప్పే. పాఠకుడు ఇష్టపడి చదువుతున్న సంఘటనని క్లుప్తంగా ముగించడం మరీ ఘోరమైన తప్పు.
 • కథాంశాన్ని ఎన్నుకున్నాక ఏ సంఘటన తరువాత ఏ సంఘటన రావాలి అనేది - రచయిత పకడ్బందీగా అమర్చుకోవాలి. సినాప్సిస్ లోనే నోట్ చేసి పెట్టుకోవాలి.
 • ఒక్కసారి పాఠకుడు రచయిత గ్రిప్ లోకి వచ్చేసిన తరువాత ఆ సంఘటనని ఎంత దూరం లాక్కెళ్ళినా పాఠకుడు టెన్షన్ తోనే చదువుతాడు. దీనికి చాలా మంచి ఉదాహరణ ’తులసిదళం’ క్లైమాక్స్! కథాపరంగా జరిగే దాదాపు ఐదు నిముషాల కాలాన్ని ఈ నవలలో వంద పేజీలు వ్రాయడం జరిగింది. పాఠకుడు ఏయే సంఘటనలని విపులంగా చదవడానికి ఉత్సాహపడతాడు అనేది రచయిత ముందే తెలుసుకుని ఉండగలగాలి. అలాగే, అనవసరమైన సంఘటనలని లాగడం పాఠకులకి బోర్ కొట్టిస్తుంది.