యండమూరి రచన ప్రస్థానం...

యండమూరి కథా కథనం క్షణ క్షణం విభ్రమాన్ని కలిగించి ఉత్సుకతని రేకెత్తిస్తుంది. ఆయన రచనల్లో విశ్లేషణాత్మక వివరణలు విపులంగా ఉంటాయి. ఎక్కడా చాదస్తం అన్పించడం గానీ, బోరుకొట్టడం కానీ ఉండదు. తెలుగు సాహిత్యంలోని ప్రముఖ కవులు, ఆంగ్ల కవుల పద్యపాదాలు సందర్భానుసారం రచనలో ప్రస్తావనకి తెస్తారు. అవి నవలా శిల్పాన్ని మరింత రమణీయం చేస్తాయి. వస్తు వైవిధ్యం, ప్రక్రియా పరమైన విభిన్నత, చక్కటి శైలి యండమూరి రచనల్లో ఉండి అలరిస్తాయి. పాఠకులకి రసానుభూతి కల్గిస్తాయి. కథ, నాటిక, నాటకం, నవల, వ్యక్తిత్వ వికాస రచనలు చేసారు యండమూరి.

యండమూరి రచయిత కావడం వెనుక ఆయన మామయ్య రావిపాటి వేణుగోపాలరావు గారి ప్రోత్సహం ఉంది. తండ్రిగారైన చక్రపాణిగారు, తల్లిగారి నాన్నగారైన రావిపాటి సత్యనారాయణ గారు కవులు. అలా సాహిత్య ప్రవేశమున్న కుటుంబంలో పుట్టిన ప్రభావం కొంత పడడంతో రచయిత అయ్యారు.

చిన్నప్పుడు ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ పోగొట్టుకోవడం కోసం యండమూరిని ఒక నాటిక రాయమని ప్రోత్సహించారు వారి మామయ్య. అప్పటికి దాన్ని అధిక మించడానికి అడపాదడపా సాహిత్యం చదివిన అనుభవంతో ఓ చిన్న కథ రాసి ’చందమామ’కి పంపించారు. 1968లో ఆ కథని ప్రచురించి పదిరూపాయలు యండమూరికి పంపించారు. ఆ మనియార్డరు ఫారమ్ ని ఇప్పటికీ దాచుకున్నారాయన. తర్వాత ’చందమామ’లో తరచూ కథలు రాసేవారు. భేతళ-విక్రమార్క కథల కోసం ప్రత్యేకించి కథలల్లి రాయడం యండమూరితోనే ప్రారంభమయింది.

1963 నుండి క్రమం తప్పకుండా డైరీ రాసే అలవాటున్న యండమూరి రచనలకు పునాదులు డైరీలే. బాల్యంలో ఇసుక తిన్నెలపై కూర్చుని డైరీలు రాసుకున్న భావుకుడాయన. చిన్న చిన్న వాక్యాలతో అందమైన భావాలు స్పందనతో రాసుకున్నవి ఆయన డైరీల్లో ఎన్నో ఉన్నాయి. ఎంత పెద్ద అనుభవాన్నైనా క్లుప్తమైన పదాల్లో ఒదిగేలా చెప్పగలిగే నేర్పు డైరీ వ్రాయడం వల్ల వస్తుంది.

తొలి రచన:

వర్షాన్ని చూస్తూ తాను పొందిన అనుభూతుల్ని క్రోడీకరించి 1968లో ’ముసురు పట్టిన రాత్రి’ అనే కథ రాసారు. అదే ఆయన తొలి రచన. ఆ రచనకి ఇన్ కంటాక్స్ వారు నిర్వహించిన కథల పోటీలో ప్రథమ బహుమతి లభించింది. ఆ కథ ’ఆంధ్రప్రభ’లో అచ్చయ్యింది. అప్పటి ఎడిటర్ నార్ల వెంకటేశ్వర్రావు రాసిన లెటర్ ఇప్పటికీ ఆయన వద్దే పదిలంగా ఉంది.1969-1994 పాతికేళ్ళ రచనా వ్యాసంగంలో అత్యుత్తమ కథలు 25 కలిపి ’ది బెస్ట్ ఆఫ్ యండమూరి’ పేరిట కథ సంపుటిగా వచ్చింది. ఇది పలుమార్లు పునర్ముద్రితమయ్యింది. మంచి సక్సెస్ అయ్యింది.

నాటక రంగం:

యండమూరి రచించిన ’గులక రాళ్ళు - గులాబి ముళ్ళు’ అనే తొలి నాటిక ’ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమయ్యింది. సామర్లకోటలో ఆ నాటిక ప్రదర్శిస్తుంటే వెళ్ళారు యండమూరి. కొన్ని డైలాగులకి చప్పట్లు మారుమోగాయి. చాలా సంతోషమనిపించింది. అప్పటి నుండి రచనలపై దృష్టి సారించారు. ఒక ప్రక్క సి.ఏ. పూర్తి చేసి ఉద్యోగంలో చేరి అది చేస్తూనే మరో ప్రక్క రచనలు చేసేవారు యండమూరి. ఆయన రాసిన ’రఘపతి రాఘవ రాజరాం’ నాటకానికి ’సాహిత్య అకాడమీ అవార్డు’ వచ్చింది. 1977 వరకు ఎక్కువ నాటకాలే వ్రాసారాయన.

ఆయన మొదటగా రాసిన నాటకం పేరు ’శివరంజని’. ’కుక్క’, ’మనుషులొస్తున్నారు జాగ్రత్త’, ’రుద్రవీణ’ నాటికలు, ’డామిట్ కథ అడ్డం తిరిగింది’ నాటకం ఎంతో ప్రజాదరణ పొందాయి.

యండమూరి నాటకాలు 5 కలిపి ఒక పుస్తకంగా వచ్చాయి. అవి 1.రఘుపతి రాఘవ రాజారాం, 2.పుట్ట, 3.శివరంజని, 4.జలతరంగిణి, 5.డామిట్ కథ అడ్డం తిరిగింది.

అలాగే ఆయన 9 నాటికలు కల్పి మరో పుస్తక రూపంలో ప్రచురించబడ్డాయి. అవి 1.రుద్రవీణ, 2.ముష్టియుద్ధం, 3.గులక రాళ్ళు-గులాబీ ముళ్ళు 4.రంగుల నీడ, 5.మనీ+షి, 6.చీమ కుట్టిన నాటకం, 7.సర్పదుష్ట, 8.కుక్క.

నవలలు:

ఆంధ్రభూమి సచిత్రవార పత్రికలో ’తులసిదళం’ సీరియల్ గా రావడం మొదలు పెట్టింది. దానికి విపరీతమైన స్పందన వచ్చింది. పెద్ద ట్రెడ్ సృష్టించింది. ఆ తర్వాత తులసి కూడా బాగా క్లిక్ అయ్యింది. ’ఋషి’, ’పర్ణశాల’, ’నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య’ అనే నవలలు పత్రికల్లో సీరియల్స్ గా వచ్చాయి. ’వెన్నెల్లో ఆడపిల్ల’ నవల సీరియల్ గా రావడం పూర్తయ్యాక పుస్తకంగా వచ్చింది. ఆ నవల సీరియల్ గానూ, ప్రచురణగానూ ఘన విజయం సాధించింది. అప్పటి నుంచి యండమూరి వెనుదిరిగి చూడలేదు. మద్రాస్ వెళ్ళి ’దొంగ మొగుడు’ సినిమాకి పనిచేస్తున్నప్పుడు ఇక యండమూరి పని అయిపోయిందని ప్రచారం నడుస్తోంది.

అప్పటికే విడుదలయిన రుద్రనేత్ర, అగ్నిప్రవేశం అనే డైరెక్ట్ నవలలు అంత సక్సెస్ కాలేదని, సినిమాల్లో పడిపోయాడని ప్రచారం జరుగుతున్న రోజుల్లో తిరిగి రాయగలనా అని ఆలోచించారు. శక్తిని కూడదీసుకొని ఆంధ్రజ్యోతి వార పత్రికలో ’ప్రేమ’ అనే నవల ప్రారంభించారు. అది అనూహ్య విజయం సాధించింది. ఆ తర్వాత ఆంధ్రభూమి వార పత్రికలో ’ప్రియురాలు పిలిచె’ రాశారు. అది గ్రాండ్ సక్సెస్. ఇక అక్కడ నుండి విజయ పరంపర మొదలయ్యింది. ’అంతర్ముఖం’తో అది పరాకాష్ఠకు చేరుకుంది.

ఆయనవి 49 నవలలు ప్రచురితమయ్యాయి. అత్యధిక శాతం మెగా హిట్లయ్యాయి. యండమూరికి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించి పెట్టాయి. అవన్నీ ఒకదానికి మరొకటి విభాన్నాంశాలతో ఉండి పాఠకుల్ని ఆకట్టుకున్నాయి. యండమూరి నవలలు సినిమాలుగా వచ్చాయి.

ఆ తర్వాత నవలా రంగానికి డిమాండ్ తగ్గింది. టి.వి చానళ్ళ రాకతో చదవడం కన్నా చూడటానికి ప్రాధాన్యత పెరిగింది. అటువంటి సమయంలో ’విజయం వైపు పయనం’ అనే పుస్తకాన్ని వ్రాసి రిలీజు చేసారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. పాఠకులకు ఏది అవసరమో వారేది కోరుకుంటున్నారో తెల్సింది. అదే పుస్తకాన్ని మరింత విస్తృతం చేసి మరికొన్ని అంశాలు చేర్చి ’విజయానికి ఐదు మెట్లు’ రాశారు. అది ఇప్పటిదాక కోటీ పాతిక లక్షల రూపాయల విలువైన కాపీలు అమ్ముడు పోయింది. దీన్ని బట్టి ఆ పుస్తకానికున్నడిమండ్ అర్థమవుతుంది. ఈ పుస్తకం ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ప్రేరణ కల్గించింది. తరువాత భగవద్గీత ఆధారంగా చేసుకుని వ్రాసిన ఆధునిక మనో వైజ్ఞానిక గ్రంధం ’విజయానికి ఆరో మెట్టు’ ఘన విజయాన్ని సాధించింది.

ఆయన ఇటీవల రాసిన పుస్తకం ’తప్పుచేద్దాం రండి’. మొట్ట మొదటిసారిగా కథ మిళితమైన వ్యక్తిత్వ వికాస పుస్తకమిది. బహుళ ప్రజాదరణ పొందుతోంది. 3నెలల్లో 3 ఎడిషన్స్ వచ్చాయి. అలాగే పిల్లల కోసం చదువు మరియు సమగ్ర వికాసం అంశాలతో వ్రాసిన ’స్టడీ టెక్నిక్స్’ తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ప్రచురితమయ్యాయి. ఇవి కూడా ’బెస్ల్ సెల్లర్స్’ టైటిల్ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాయి.

కొన్ని జ్ఞాపకాలు...


  • యండమూరి వీరేంధ్రనాథ్ తండ్రి ఒక రాత్రంతా మేలుకొని ఇంగ్లీషు టెక్ట్స్ బుక్ మొత్తం తెల్ల కాగితాలపై రాసారు. అందులో మొదటి పాఠం గాంధీ గారి ’సెల్ఫ్ హెల్ఫ్’. యండమూరికి అది బాగా వంట బట్టింది. సొంత కాళ్ళపై నిలబడాలన్న తపన మొదలయ్యింది. తరువాత పరీక్షల్లో మంచి మార్కులతో పాసవ్వడమే కాక ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడే ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టాడు. రోజుకు రూపాయి ఇచ్చేట్టు ఒప్పందం. పుస్తకం మనిషిని మారుస్తుందనటానికి ఇది ఓ ఉదాహరణ.
  • ఆయనకి అత్యంత ప్రీతి పాత్రమైనది గోదావరి. బాల్యంలో ఎన్నోసార్లు గోదావరి ఒడ్డున విహరించారు. ఆ ఇసుక తిన్నెల్లో ఆడుకున్నారు. గోదావరి మీదుగా ఉదయించే సూర్యుడు, ఆ కిరణాల వెలుగులో ఒకదానివెంట ఒకటిగా తీసుకొచ్చే అలలు, తీరంలో కాపలాగా నుంచున్నట్లుండే కొబ్బరి చెట్లూ, వాటి ఆకులపై పడి మెరిసే వెన్నెల...అవన్నీ అపురూప దృశ్యాలు ఆయన మదిలో అలా నిలిచిపోయాయి. అందుకే ప్రతి నవలలో గోదావరి ప్రస్తావనుంటుంది.